ప్రాచుర్యం లో ఉండే చాలా పంచాంగాలు, పూర్వకాలంలో వ్రాసిన పద్ధతులని బీజ సంస్కారం చేయకుండా తిథులు, నక్షత్రాలు మొదలైనవి లెక్కించడానికి వాడుతుండడంతో, అమావాస్య, పౌర్ణమి తిథి ముగిసే సమయాలు సరిగ్గారావు. ఉదాహరణకి, అమావాస్య ముగిసే కాలానికి సూర్యుడు, చంద్రుడు మధ్య సరిగ్గా 0 డిగ్రీలు ఉండాలి. పూర్వ సిద్ధాంత పంచాంగాలలో అలా ఉండవు. కానీ, దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం, తిథి ముగిసే సమయాలు, సూర్యచంద్రుల మధ్య డిగ్రీలకు సరిగ్గా సరిపోతాయి.
తిథులు, నక్షత్రాలు మాత్రమే కాకుండ, ఉత్తరాయనం, దక్షిణాయనం, ఋతువులు ప్రారంభమయ్యే సమయాలు కూడ దృగ్గణిత సిద్ధాంతం ఆధారంగా గణించబడ్డాయి. ఉత్తరాయనం అనగా, సూర్యుడు ఉదయించే ప్రదేశం ఉత్తరం వైపుకు వెళుతూంటుంది. మకరసంక్రాంతి అనగా సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశించే సమయం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ రెండు ఒకేసారి జరిగేవి. కానీ ఇప్పటికీ, ఉత్తరాయన ప్రవేశం, మకరసంక్రాంతి ఒకే రోజు జరుపుకోవడం సరికాదు. ఇప్పుడు ఉత్తరాయనం డిసెంబర్ 21/22 న ప్రవేశిస్తే, మకరసంక్రమణం జనవరి 14/15 న జరుగుతుంది. అదేవిధంగా, ఋతువులు చాంద్రమాసములని బట్టి చెప్పకూడదు. ఉదాహరణకి, మే నెలలోని ఎండాకాలం, వైశాఖమాసంలో ఉందని వసంత ఋతువు, జూలై నెలలోని వర్షాకాలం, ఆషాఢమాసంలో ఉందని గ్రీష్మ ఋతువు అని ఎలా అనగలం.
నక్షత్రాల సమయం కోసం నిజచిత్రపక్ష అయనాంశని ఉపయోగించబడినది. పంచాంగం మరియు జాతకముల కోసం ఏ అయనాంశని వాడాలన్నదానిపై భిన్నాభిప్రాయలు, వాదోపవాదాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, మన ఋషులు ఆకాశంలో ఉండే అనేక నక్షత్రాలలో, భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యకి దగ్గరిగా ఉండే 27 నక్షత్రాలను తీసుకొని, కక్ష్యలో ఉండే 360 డిగ్రీలను వాటి మధ్య సమంగా విభజించారు. కానీ ప్రతీ నక్షత్రవిభాగానికి సరిహద్దు ఎన్ని డిగ్రీలనుండి ఎక్కడి దాకా అనేది అయనాంశ చర్చలో ముఖ్యవిషయం. ఏ నక్షత్రాన్ని ప్రధాన నక్షత్రంగా ఉపయోగించారు అనేదానిపై ఆ అయనాంశకి నామకరణం చేయడం జరిగింది (చిత్రపక్ష అయనాంశ, రోహిణిపక్ష అయనాంశ, పుష్యపక్ష అయనాంశ మొదలైనవి).
చిత్రపక్ష అయనాంశని ఉపయోగించడానికి కారణం, భారత ప్రభుత్వం పండగలని ప్రచురించడానికి చిత్రపక్ష అయనాంశని ఉపయోగిస్తుంది. ఇతర అయనాంశలని వాడితే అధికమాసాలని లెక్కించే విధానం మారి, కొన్నిసార్లు పండుగలు ఒకనెల ముందు లేదా వెనుక రావచ్చు. అందువలన ఈ కాలెండర్‌లో చిత్రపక్ష అయనాంశని ఉపయోగించడం జరిగింది.
ఈ కాలెండర్‌లోని నక్షత్రసమయాలు, ఇతర దృగ్గణిత పంచాంగాలకన్నా సుమారు 2 నిమిషాలు తేడా ఉండవచ్చు. ఎందుకంటే, చాలా దృగ్గణిత పంచాంగాలు చిత్రపక్ష అయనాంశని లెక్కించడానికి N.C.లహరి గారు 1950 సంవత్సరంలో సూత్రీకరించిన విధానం వాడితే, ఈ కాలెండర్‌లో నిజచిత్రపక్ష అయనాంశని (చిత్త నక్షత్ర స్ఫుటలు) ఉపయోగించబడినవి. చిత్ర నక్షత్ర స్థానం ఆకాశంలో సరిగ్గా తెలుసుకునే పరిజ్ఞానం ఉన్న ఈరోజుల్లో, ఉజ్జయింపుగా లెక్కించే లహరి సూత్రాలు అవసరంలేదు.
సూర్యోదయ, అస్తమయ, చంద్రోదయ అస్తమయ, సమయాలు వాతావరణ వక్రీభవన సూచిక (refractive index) పరిగణనలోకి తీసుకోకుండా, భూకేంద్రం నుండి మధ్యబింబ దర్శనకాలముగా గణించబడ్డాయి. దీనివలన, సూర్యోదయ సమయానికి సూర్యస్ఫుటలు లగ్నస్ఫుటలు సరిపోతాయి.
పైన పేర్కొన్న విషయాలన్నీ లెక్కలోకి తీసుకొని తయారుచేయబడిన కాలెండర్ ఏదీ లేకపోవడంతో దీనిని వ్రాయవలిసివచ్చింది. దీనిని గణించడానికి ఉపయోగించిన సోర్స్‌కోడ్ github (https://github.com/smurtym/shubharambham) లో విజ్ఞులైన వారి సమీక్షకై ఉన్నది. ఈ సంకల్పాన్ని ఆదరిస్తారని భావిస్తూ..
మునుకుట్ల సత్యనారాయణ మూర్తి