ఏకాదశితిథి నిర్ణయవిధానం

ఏకాదశి నియమము అనేది సనాతనధర్మంలో పాటించే నియమములలో చాలా ముఖ్యమైనది. ఏకాదశి తిథి నిర్ణయం వైష్ణవులు, స్మార్తులు వేర్వేరు పద్ధతులలో చేస్తారనే విషయం చాలామందికి తెలిసేఉంటుంది. పంచాంగాలలో స్మార్త ఏకాదశి, వైష్ణవ ఏకాదశి రోజులు ప్రత్యేకంగా వ్రాస్తారు. వాటిని నిర్ణయించే విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

ముందుగా వైష్ణవులు ఉపవాసంచేసే రోజును ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం.

వైష్ణవులు ఏకాదశిని అరుణోదయ సమయాన్నిబట్టి నిర్ణయిస్తారు. అరుణోదయ సమయం అనగా 73.3% రాత్రి సమయం దాటాక (సుమారు తెల్లవారుజాము గం4-24ని. కి, ఇది భౌగోళిక ప్రదేశాన్ని బట్టి, ఋతువుని బట్టి మారుతుంది). ఒకవేళ అరుణోదయ సమయానికి ఏకాదశి ఉన్నరోజు లభించకపోతే, ద్వాదశి రోజు ఉపవాసం చేస్తారు, కాని దశమి అరుణోదయ సమయానికి ఉంటే (సూర్యోదయానికి ఏకాదశి ఉన్నా సరే) దాన్ని వదిలేస్తారు.

1. మూడురోజులు వరుసగా అరుణోదయ సమయానికి దశమి, ఏకాదశి, ద్వాదశి ఉంటే, అరుణోదయ సమయానికి ఏకాదశి ఉన్నరోజు ఉపవాసం. (సూర్యోదయానికి ఉన్న తిథిని పట్టించుకోక్కరలేదు).

2. రెండురోజులు వరుసగా అరుణోదయ సమయానికి దశమి, ద్వాదశి ఉంటే, అనగా ఏకాదశి ముందురోజు అరుణోదయ సమయం తర్వాత మొదలై, తరువాత రోజు అరుణోదయ సమయం కన్న ముందే వెళిపోతే, ద్వాదశి అరుణోదయం ఉన్నరోజే ఉపవాసం చెయ్యాలి (అంటే ఆరోజు సూర్యోదయానికి కూడా ద్వాదశి ఉంటుంది). దశమి అరుణోదయంలో ఉన్నరోజు సూర్యోదయానికి ఏకాదశి ఉన్నా, ఆరోజు పనికిరాదు.

3. రెండురోజులు వరుసగా అరుణోదయ సమయానికి ఏకాదశి ఉంటే, రెండవరోజు ఏకాదశి ఉపవాసం చెయ్యాలి. ఆ రెండురోజుల్లో రెండవరోజు అరుణోదయ సమయానికి ఏకాదశి ఉండి, సూర్యోదయానికి ద్వాదశి ఉన్నాసరే, ఆరోజే ఉపవాసం చెయ్యాలి. ముందురోజు అరుణోదయ సమయానికి, సూర్యోదయ సమయానికి, రోజు మొత్తం ఏకాదశి ఉన్నా ఆరోజు పనికిరాదు.

ఇప్పుడు స్మార్తులు ఉపవాసంచేసే రోజును ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం.

ఏకాదశి ఉపవాసం తర్వాత చేసే భోజనాన్ని "పారణ" అంటారు. స్మార్తులు పారణని సూర్యోదయ సమయంలో ద్వాదశి ఉన్నరోజే చేస్తారు. స్మార్తులకు సూర్యోదయ సమయంలో త్రయోదశి ఉంటే ఆరోజు పారణకి పనికిరాదు. ఒకవేళ ద్వాదశి సూర్యోదయం ఉన్నరోజు లభించక పోతే, దశమి రోజు అయినాసరే ఉపవాసం చేసి, ఏకాదశి సూర్యోదయం ఉన్నరోజు పారణ చేస్తారు.

1. మూడురోజులు వరుసగా సూర్యోదయ సమయానికి దశమి, ఏకాదశి, ద్వాదశి ఉంటే, సూర్యోదయ సమయానికి ఏకాదశి ఉన్నరోజు ఉపవాసం.

2. మూడురోజులు వరుసగా సూర్యోదయ సమయానికి దశమి, ఏకాదశి, త్రయోదశి ఉంటే, (అనగా ఏకాదశిరోజే ద్వాదశి మొదలై తర్వాతరోజు సూర్యోదయం అయ్యేలోపు వెళిపోతే), ఏకాదశి సూర్యోదయం ఉన్నరోజు ఉపవాసానికి పనికిరాదు. ఎందుకంటే తర్వాత త్రయోదశి సూర్యోదయం ఉన్నరోజు స్మార్తులు పారణ చేయకూడదు. అందుకని దశమి సూర్యోదయం ఉన్నరోజు ఉపవాసం చేసి, ఏకాదశి-ద్వాదశి కలిసి ఉన్నరోజు పారణ చేస్తారు.

3. ఒకవేళ రెండురోజులు వరుసగా సూర్యోదయ సమయంలో ఏకాదశి ఉంటే ఎప్పుడు ఉపవాసం చెయ్యాలో తెలుసుకుందాం.
a. రెండురోజులు వరుసగా సూర్యోదయ సమయంలో ఏకాదశి ఉంటే, సాధారణంగా మూడవ రోజు సూర్యోదయానికి ద్వాదశి ఉంటుంది. అప్పుడు రెండవరోజు సూర్యోదయ సమయంలో ఏకాదశి ఉన్నరోజు ఉపవాసం చెయ్యాలి.
b. చాలా అరుదుగా, రెండురోజులు వరుసగా సూర్యోదయ సమయంలో ఏకాదశి ఉన్నప్పుడు, మూడవ రోజు సూర్యోదయానికి త్రయోదశి వచ్చేస్తుంది. అనగా రెండవరోజు ఏకాదశి వెళిపోయాక ద్వాదశి వచ్చి తర్వాతరోజు సూర్యోదయం లోపు ద్వాదశి కూడా వెళిపోతుంది. ఇలాంటప్పుడు స్మార్తులు మొదటిరోజు సూర్యోదయ సమయంలో ఏకాదశి ఉన్నరోజు ఉపవాసం చెయ్యాలి. (ఎందుకంటే రెండవ రోజు ఉపవాసం చేసి, త్రయోదశి రోజు పారణ చెయ్యకూడదు కాబట్టి). ఇలాంటిసందర్భం కొన్ని ఆంధ్రప్రదేశ్ నగరాలలో 2030 మార్చి 16 న వస్తుంది.

4. ఏకాదశి సూర్యోదయం ఉన్నరోజు రాకపోతే, అనగా దశమి సూర్యోదయం ఉన్నరోజే ఏకాదశి వచ్చి తర్వాతరోజు సూర్యోదయంలోపు వెళిపోతే స్మార్తులు ఏంచెయ్యాలో చూద్దాం.
a. సాధారణంగా, ఇలాంటప్పుడు వరుసగా సూర్యోదయానికి దశమి, ద్వాదశి, త్రయోదశి తిథులు వస్తాయి. అప్పుడు దశమి-ఏకాదశి కలిసిఉన్నరోజు ఉపవాసం చేసి, ద్వాదశి రోజు పారణ చెయ్యాలి.
b. చాలా అరుదుగా, నాలుగు రోజులు వరుసగా సూర్యోదయానికి దశమి, ద్వాదశి, మళ్ళీ ద్వాదశి, త్రయోదశి తిథులు వస్తాయి. అనగా మొదటిరోజు దశమి-ఏకాదశి కలిసి ఒకేరోజున ఉండి, తర్వాత ద్వాదశి రెండురోజులు వరుసగా సూర్యోదయసమయానికి ఉంటుంది. అప్పుడు మొదటి సూర్యోదయంలో ద్వాదశి ఉన్నప్పుడు ఉపవాసం చేసి, తర్వాతరోజు సూర్యోదయంలో ద్వాదశి ఉన్నరోజు పారణ చెయ్యాలి. స్మార్తులు ఏకాదశి ఉపవాసం ద్వాదశిరోజు చేసే సందర్భం ఇదిఒక్కటే. ఇలాంటిసందర్భం 2029 ఫిబ్రవరి 9 న పారిస్, ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరాలలో వస్తుంది.

పైన తెలియచేసిన ఏకాదశితిథి నిర్ణయవిధానం గృహస్తాశ్రమం లోనివారికే వర్తిస్తుంది. సన్యాసులకి ఏకాదశితిథి నిర్ణయవిధానం వేరే పద్ధతిలో ఉంటుంది, దానిగురించి భవిష్యత్తులో ఎప్పుడైన తెలుసుకుందాం.